Tuesday, May 22, 2012

యాభయ్యేళ్ల 'మంచి మనసులు'


మంచి సినిమా అని చెప్పుకోవడానికి, పదే పదే ఆ అనుభూతులు స్మరించుకోవడానికీ కొన్ని లక్షణాలుంటాయి. ముఖ్యంగా ఆ కథ కాలాతీతంగా నిలబడాలి. ఇప్పుడు చూసినా ఆ భావాలు కొత్తగా కనిపించాలి. ముఖ్యంగా పాటలు మళ్లీ మళ్లీ పాడుకొనేలా ఉండాలి. ఇవన్నీ అక్షరాలా పుణికిపుచ్చుకొన్న చిత్రం 'మంచి మనసులు'. అక్కినేని నాగేశ్వరరావు-సావిత్రి కలయికలో ఎన్నో మరపురాని చిత్రాలొచ్చాయి. ఆ జాబితాలో మొదటి వరుసలో ఉండే చిత్రమిది. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వ ప్రతిభ, కె.వి.మహదేవన్‌ సంగీత ఝురి ఈ సినిమాకి వన్నె తీసుకొచ్చాయి. బాబూ మూవీస్‌ పతాకంపై సుందరం ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్కినేని నటించిన 98వ చిత్రమిది. బుధవారంతో యాభై ఏళ్లు పూర్తి చేసుకొన్న 'మంచి మనసులు' గురించి క్లుప్తంగా...కథల ఎంపికలో ఏఎన్నార్‌ ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటారు. తన పాత్ర బాగుంటే సరిపోదు... చుట్టూ ఉన్న పాత్రలు కూడా బాగా పండాలి. ఈ పద్ధతే... ఆయన్ని విజయవంతమైన కథానాయకుడిగా నిలబెట్టింది. ఎస్వీ రంగారావు, సావిత్రి, గుమ్మడి, సూర్యకాంతం, నాగభూషణం అందరూ ఉద్ధండులైన నటులే. బాధ్యతగల తమ్ముడిగా, ప్రేమికుడిగా అక్కినేని పలికిన హావభావాలు ఎప్పటికీ మర్చిపోలేం. ముఖ్యంగా చేయని నేరాన్ని నెత్తిమీద వేసుకొన్న ముద్దాయిగా చక్కని అభినయం పలికించారు. శాంతి పాత్రలో సావిత్రి ఒదిగిపోయారు. ముఖ్యంగా కోర్టు సన్నివేశంలో ఎస్వీఆర్‌తో పోటీపడి నటించింది. సంభాషణలు పలకడంలో, పదాలు విరచడంలోనూ నాగభూషణం చూపిన శైలి ప్రేక్షకులకు నచ్చింది. సూర్యకాంతం తనకు అలవాటైన గయ్యాళి పాత్ర వదిలి ఈ సినిమా కోసం సాత్వికంగా కనిపించారు.
మైమరపించే బాణీలు కె.వి.మహదేవన్‌ అందించిన బాణీలు ఈ చిత్ర విజయంలో ప్రధాన పాత్ర పోషించాయి. పాటలన్నీ శ్రోతల ఆదరణ పొందాయి. 'నన్ను వదిలి నీవు పోలేవులే.. అదీ నిజములే' (దాశరథి), 'ఏవండోయ్‌ శ్రీవారూ' (ఆరుద్ర), 'ఎంత టక్కరి వాడూ'(కొసరాజు), 'త్యాగం ఇదియేనా' (శ్రీశ్రీ), 'ఒహో ఒహో పావురమా', 'శిలలపై శిల్పాలు చెక్కినారూ' (ఆత్రేయ) ఇలా ప్రతి పాటా గుర్తిండిపోయేదే. ముఖ్యంగా 'మావ మావ... మావా' (కొసరాజు) పాట ఉర్రూతలూగించింది. ఈ పాటే మహదేవన్‌ని 'మామ'గా అందరి చేతా ప్రేమగా పిలుచుకొనేలా చేసింది. ఏప్రిల్‌ 11, 1962న విడుదలైన ఈ చిత్రం ఇరవైమూడు కేంద్రాల్లో వంద రోజుల పండగ జరుపుకొంది

No comments:

Post a Comment