Tuesday, May 22, 2012

మేకప్ మాంత్రికుడు .... " అంజి బాబు "


డిస్కో డాన్సర్ ....! డాన్స్...డాన్స్ ... మిథున్ చక్రవర్తి ...
స్టాప్ ... ఫుల్ స్టాప్ ....
మిథున్ నువ్విప్పుడు ..రామకృష్ణ పరమహంసవి ....
నేనా ..రామకృష్ణ పరమహంస నా ... జి.వి.అయ్యర్ గారు ఈ మాట ఎవరైనా వింటే నవ్విపోగలరు ...
నేనేమిటి..?...పరమహంస ఏమిటి...?
మరి ...అంజిబాబు గారు చెప్పారయ్యా.....
ఎంజో బాబోజి !
నేను ఠాకూర్ జి (రామకృష్ణ పరమహంస - ఠాకూర్) లాగ కనిపిస్తున్నానా ..? మీరు జోక్ చేయడం లేదుకదా ...?
మిథున్ ...ఇవాల్టినుంచి ..పదకొండు రోజులు పాటు కేవలం ద్రవాహారం ..అంటే ...గ్లూకోజ్ ...పళ్ళరసాలు తీసుకుంటూ ...
ఘనాహారం పూర్తిగా మానేయి ... పన్నెండో రోజు నా మేకప్ రూమ్ లో కూర్చో ...
ఆ రోజు వచ్చింది ...
అర్ధగంటలో ..మిథున్ చక్రవర్తి ..రామకృష్ణ పరమహంస లాగ ..రూపుమారిపోయాడు ...
అద్దంలో తన రూపు చూసుకుని మిథున్ గతుక్కుమన్నాడు ...
ఎంజో బాబోజి ...నా ముందరి రెండు పళ్ళు ఏమయ్యాయి ...?
కంగారుపడకు మిథున్ ...మేకప్ తీసేస్తే ..మళ్లీ వచ్చేస్తాయి ...
ఆ తర్వాత వంతు ...విశ్వనాథ్ గారి సిరివెన్నెల హీరో సర్వదమన్ బెనర్జీ ది ...
పదినిమషాల్లో ..స్వామి వివేకానందగా మారిపోయాడు ...
అయ్యో...ఎంజో బాబోజి ..నా కోటేరులాంటి ముక్కు ఏమయ్యింది ...?
నీకు మరీ కంగారు బెనర్జీ ...!
వివేకానందుడికి కోటేరులాంటి ముక్కు ఉంటుందా చెప్పు ....మేకప్ తీసేసాక నీ ముక్కు నీకోచ్చేస్తుంది లే...!పో ...
ఇలా ....వరసగా ..
రజినీకాంత్ కమలహాసన్ ,జయప్రద ,ప్రదీప్ కుమార్ ,మీనాక్షి శేషాద్రి ,జుహిచావ్లా ,అనుపంఖేర్ ,షమ్మి కపూర్ ,శశి కపూర్ ,తదితరులంతా ...
అంజిబాబు మేకప్ మాయజాలంతో మధుఅంబట్ కెమెరా ముందు నటించారు ...
ఇదంతా ...
టి.సుబ్బిరామిరెడ్డి నిర్మాణం లో ప్రముఖ దర్శకుడు జి.వి అయ్యర్ దర్సకత్వం లో వచ్చిన " స్వామి వివేకానంద " సినిమా సందర్భం గా జరిగిన సంఘటన ...
ఒకరోజు ..
బెంగుళూరులో ...షూటింగ్
దర్శకుడు జి.వి.అయ్యర్ సూచనల మేరకు అలనాటి డ్రీం గర్ల్ హేమామాలిని కెమెరా ముందుకు వచ్చారు ...అయితే మధు అంబట్ కెమెరా స్టార్ట్ చేయలేదు
మేకప్ లో ఏదో తేడా ఉందే ...అంజిబాబు గారు ఎక్కడా ?
తన మేకప్ తనే చేసుకుంటానంటే సర్లే అన్న మధూ ..!
సినిమా అంత మీ చేతి మీదుగా నడుస్తుంది మేకప్ .ఇప్పుడు తేడా రాదు ...ఆ మాత్రం మేము తెలుసుకోలేమనుకున్నారా ..?
మేడం మీ మొహం శుభ్రంగా కడిగేసుకుని కూర్చోండి ...
మేకప్ పూర్తయింది ...
తన అందం అద్దంలో చూసుకుని తెగ మురిసిపోయింది హేమామాలిని
థాంక్యూ బాబుజి ... అని చెప్పి కెమెరా ముందుకు వెళ్ళింది ...ఇప్పుడు కెమెరా స్టార్ట్ అయింది ...

తెరవెనుక హీరో
-------------------
ఇట్లా .. సామాన్య ప్రేక్షకుడికి తెరమీద రాగద్వేషాలు కలిగించే దృశ్యాల వెనుక టెక్నీషియన్ ల మహోన్నత ప్రతిభ దాగిఉంటుంది.
ఒకవేళ మూడేళ్ళ పాటు ఒక సినిమా ఆగిపోయి ఆ తర్వాత షూటింగ్ ప్రారంభం అయిందనుకోండి .. ఈ లోగా హీరో &హీరోయిన్ దేహ షౌస్ట్టవం లో కలిగే మార్పు సినిమా కథకు అతకదు
మూడేళ్లక్రితం ఎలా ఉందో అలాగే కనిపిచేటట్లు చేసే రూపశిల్పి " మేకప్ ఆర్టిస్ట్ "... ఇది ఏ సినిమాకైన ఆయువుపట్టు లాంటిది ...
అలాంటి ఈ మేకప్ రంగం లో భారత దేశం మొత్తం మీద నంబర్ వన్ గా వెలుగొందుతున్న కళాకారుడు
ప్రొఫెసర్ సాధినేని అంజిబాబు .. మన " తెలుగువాడు " ...
బెంగాలివాళ్ళు ఆయన్ను ఎంజో బాబోజి అంటారు ...
సహచరులు ..ఎంజాయ్ బాబు అంటారు ...

భారతదేశం లో కళావిభాగాలు ఉన్న విశ్వవిద్యాలయాలులలో తొంభై శాతంనికి విజిటింగ్ ప్రొఫెసర్ గా
మేకప్ రంగాన్ని విశ్వవిద్యాలయాల శాస్త్ర స్థాయి కి తీసుకువెళ్ళిన మొదటి వ్యక్తి ... "శ్రీ అంజిబాబు "
హాలివుడ్ మేకప్ ఆర్టిస్ట్ల రీసెర్చ్ కౌన్సిల్ లో భారతదేశపు ఏకైక ప్రతినిది (ఈ కౌన్సిల్ కి 83 దేశాల నుండి 83 మంది ప్రతినిధులు ఉన్నారు )

రిచర్డ్ అటెంబరో "గాంధీ " సినిమాకు చీఫ్ మేకప్ ఆర్టిస్ట్ గా పనిచేసిన టాం స్మిత్ (లండన్ ) తో పాటు మేకప్ కో ఆర్డినేటర్ " అంజిబాబు "వ్యవహరించారు
అప్పుడు గాంధీ పాత్ర దారి బెంకింగ్ స్లీ కు ఆరుగంటల పాటు మేకప్ చేసేవాడట టాం స్మిత్ ..
చెవులు ప్రత్యేకంగా లండన్ నుంచి తయారుచేయించి తెప్పించారు..సినిమాలో మనం చూసిన గాంధీ చెవులు ,నెత్తిన గుండు అన్ని కృత్రిమమైనవే ..

ఇప్పటివరకు 30 సినిమాలు,మూడువేల టి.వి.ఫిలిం లకు ,150 డిప్లమో ఫిలిం లకు (ఫిలిం &టెలివిజన్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా ,పూణే )మేకప్ డైరెక్షన్ చేసిన
అంజిబాబు అభిప్రాయం ప్రకారం ....
మనం హాలీవుడ్ మేకప్ ష్టాయి కంటే వందేళ్ళు వెనుకబడి ఉన్నాము ..వాళ్ళకున్న చిత్త శుద్ది,పరిశోధన దృస్టి,నిరంతర అధ్యయనం మనలో లేవు ...
ప్రతి మేకప్ ఆర్టిస్ట్ ఆంత్రోపాలజీ ,కెమిస్ట్రీ,హిస్టరీ క్షుణ్ణంగా అధ్యయనం చేస్తేనే హాలీవుడ్ మేకప్ కళాకారుల కౌశలం అందుకోగలం అంటారాయన ..

ఒక్కసారి "గాంధీ" కెమెరా ముందుకు రావాలంటే ఆరుగంటల మేకప్ అవసరం కనుక ఎకబీగిన 18 గంటలు షూటింగ్ చేసేవారు రిచర్డ్ అటెంబరో
ఉప్పు సత్యాగ్రహం ఘటన చూసినవారికి ఇది బాగా తెలుస్తుంది ...
ఆసినిమా నాటికే టాం స్మిత్ కు 75 ఏళ్ళు ..అయన ప్రొఫెసర్ అంజిబాబు నైపుణ్యం చూసి ...మీదేశానికి టెక్నాలజీ తక్కువ కాని మీరు నాకంటే ఫాస్ట్ అనేవారు ..

ఇంతకుముందు జి.వి.అయ్యర్ " భగవద్గీత "కు , స్వామి వివేకానందకు ,చాణక్య ఫేం చంద్రప్రకాష్ ద్వివేది రూపొందించిన 150 ఎపిసోడ్ల మంథన్ ,125 ఎపిసోడ్ల కాళిదాస్ ,
500 ఎపిసోడ్ల బుద్ధ (జీ టివి ) సీరియల్స్ కు మేకప్ డైరెక్టర్ అంజిబాబు గారు.
కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాక ఉన్న టివి కేంద్రాలలోని మేకప్ ఆర్టిస్టులందరూ అంజిబాబు గారి వర్క్ షాప్ లోని విద్యార్ధులే ...
1987 లో త్రివేండ్రం లో జరిగిన ఏ.ఐ.బి.డి వర్క్ షాప్ లో బి.బి.సి టెలివిజన్ మేకప్ డైరెక్టర్ సుజీ డోనాల్డ్ సన్ స్వయంగా అంజిబాబు కు మోడల్ గా పనిచేసారు

ఆసియాలోనే ప్రతిష్టాత్మక పూనా ఫిలిం ఇన్స్టిట్యూట్ లో 1974 నుండి 1992 వరకు మేకప్ ఫేకల్టి కి ప్రొఫెసర్ గా పనిచేసి తర్వాత స్వచ్చందంగా పదవి విరమణ చేసి
దేశమంతా తిరుగుతూ ఉన్న అంజిబాబు తన 21 వ ఏట ఆంధ్రప్రదేశ్ ని వదిలి ఉత్తరాది వెళ్లారు ...
హిందీ ,గుజరాతి ,మలయాళం,బెంగాలి ఇత్యాది భాషల చిత్రాలకు ఎన్నిటికో పనిచేసిన అంజిబాబు ఇప్పటివరకు ఒక్క తెలుగు సినిమాకు కాని ,టి.వి.ఫిలిం కాని
" అదృష్టవశాత్తు " పనిచేయలేదు ...

" ఆంధ్రులకు కళాకారులను బతికించుకోవడం తెలియదు .ఒకవేళ వాడు బతికి పోయి గోప్పవాడైపోతే సన్మానం చేసేస్తాం అంటారుకాని ...
పరాయి వాళ్ళకి ఇస్తున్న అవకాశం మన తెలుగు వాళ్ళకి ఇవ్వరు ....
ఇదిగో నువ్వు ఫలానా పని చేయి... ఈ ప్రతిఫలం తీసుకో అని మాత్రం అనరు ..ఉత్తరాదిన పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటే " మనవాడేనోయ్ " అంటూ
కాలరేగేస్తారు .. ఇదీ మనవాళ్ళ కళాపోషణ ... "
ఆంధ్రప్రదేశ్ లో ఎందరో మహానుభావులైన కళాకారులు ఉన్నారు కానీ వాళ్ళకి అంతర్జాతీయ స్థాయికి ఎదగాలనే తలంపు ఉండనే ఉండదు అని అయన ...
తన జ్ఞాపకాల్లోకి వెళ్లారు ..!

కళాకారుడి కస్టాలు
-----------------------
1944 లో గుంటూరు పట్టణం లో పుట్టిన అంజిబాబు వీధిబడి కరడాల నుంచి విజయవాడ ఎస్.ఆర్.ఆర్ & సి.వి.ఆర్ ఆర్ట్స్ కాలేజి చదువు దాక రంగస్థలమే ఊపిరిగా ...
రంగులలో మునిగి రంగులలో తేలారు .తెలుగు నాటక వైతాళికులు అనదగిన సూరిబాబు,బందా కనకలింగేశ్వర రావు ,అబ్బూరి వర ప్రసాదరావు ,బుర్రా సుబ్రమణ్య శాస్త్రి
పెళ్లూరు శేషగిరిరావు ,కొప్పిలి(కత్తి )వెంకటేశ్వర రావు ప్రబృతులతో కలసి ఏడేళ్ళు చిరుప్రాయం నుంచే అంజిబాబు రంగస్థలమే ఇల్లువాకిలిగా జీవించారు ...
ఎన్నో ఆకలి రోజులు ,ఎన్నో నిద్రలేని రాత్రులు ..కులాయి నీళ్ళే పరమాన్నంగా భావించిన దినాలు,దర్శకత్వం వహిస్తూ రాత్రి రిహార్సల్స్లో నటీనటులను కోప్పడే నెపంతో
మద్యాహ్నం అన్నం లేని విషయాన్నీ కప్పిపుచ్చడం,నాటకం అయిపోయిన తర్వాత నిర్వాహకులు డబ్బులు ఎగ్గొడితే పదినమస్కారాలు ...డబ్బులు ఇస్తే ఒక్క నమస్కారం
పెట్టుకోవడం ..కడిగినా పోనీ రంగు మొహాలతో పరీక్ష హలో కూర్చోవడం,రంగులద్దిన చేతులతో గుమాస్తాగిరి చేయకూడదని ప్రతిజ్ఞలు చేసుకోడం ...కొత్త కొత్త నాటకాల అన్వేషణలో
విశ్రాంతి పొందటం,చాయ్ మరకలు,సిగిరెట్ పొగలే సహజ అలంకారాలుగా తిరగడం,నేషనల్ స్కూల్ అఫ్ డ్రామా డిల్లి వాళ్ళు ఉద్యోగం ఇస్తాం రమ్మంటే చార్జీలకు డబ్బులేకపోవడం ,
మావాడు గొప్ప కళాకారుడు,నటుడు,డైరెక్టర్ ,మేకప్ ఆర్టిస్ట్ , స్టేజ్ డెకోరేటార్ డిల్లి వెళ్తున్నాడు ఒక్కచార్జీకే డబ్బులున్నాయి,ఇంకో చార్జీ మీరే సర్దుబాటు చేయండి సార్ అంటూ
మిత్రులు, రైలు టి.సి.ని బతిమిలాడుకోవటం ...దేన్ని...దేన్ని మర్చిపోలేనంటారు శ్రీ " అంజిబాబు "గారు ...!

గురువును మించిన శిష్యుడు
-----------------------------------
1965 లో డిల్లి వెళ్ళిన అంజిబాబు దేశం అంతా తిరిగారు ... నేషనల్ స్కూల్ అఫ్ డ్రామా లో 1974 వరకు పనిచేసారు.
మేకప్ రంగం లో ఉత్తరాదిన మొనగాడుగా పేరు తెచ్చుకున్నారు ...
అప్పటి ప్రదానమంత్రి శ్రీమతి " ఇందిరాగాంధీ " కి అధికారక మేకప్ ఆర్టిస్ట్ గా ఐదేళ్ళు ఉన్నారు ...
ఆమె కెమెరా ముందుకు రావాలంటే "అంజిబాబు " ఓకే చేయాలి ....

ఫీల్డులో పైకెదిగిన కొద్ది డబ్బు రాసాగింది ..ఒకరోజు ప్రొఫెసర్ అంజిబాబు డిల్లి నుంచి గుంటూరు వచ్చి వృద్దుడై పేదరికం లో ఉన్న "పేనాల నారాయణ " కాళ్ళమీద పడ్డాడు
తన కాళ్ళమీద పడిన వ్యక్తిని పాత పేనాలు రిపేర్ చేసుకునే నారాయణ గుర్తుపట్టాడు ...
సూరిబాబు లాంటివాళ్ళు గ్రీన్ రూముల్లో కూర్చుంటే..వాళ్ళ ముఖాలు అందక మునిగాళ్ళ మీద లేచి ..లేచి .. మేకప్ చేసే చిన్నారి అంజి బాబే ఈ వ్యక్తి ..
ఇప్పుడు ఎంతో ఎదిగాడు ..వెంటనే ఆ వృద్దుడు పాదాలను వెనక్కు లాక్కొని " తప్పు నాయన నీ అంతటి వాడు ఇలా చేయకూడదు " అని చిన్నపోయి మందలించాడు ..
గురూ... !
" నాకీ ఎత్తు చాలదు ..ఇంకా ...ఇంకా ...ఎదుగుతాను ...నన్నెవరు అందుకోలేనంత ఎత్తుకు ఎదుగుతాను ..నా లక్ష్యాన్ని నేనెప్పుడో నిర్ణయించుకున్నాను
నేను ఆ లక్ష్యాన్ని చేరుకుంటాను ..కాని ..ఈ చేతులేప్పుడు మీ పాదాల మీదే ఉంటాయి " అని ఆ శిష్యుడు జవాబు చెప్పాడు ,
మొట్టమొదట తన చేతులు రంగుల్లో ముంచిన గురువు,తల్లి ,తండ్రి ,హితుడు,మిత్రుడు,అన్ని ఆ పేనాల నారాయణే అని శ్రీ అంజిబాబు ఉద్విగ్నుడై చెప్పారు .

తన బాల్యం నుంచి ఇప్పటివరకు అయన దాదాపు ఎనిమిదివేల తెలుగు,బెంగాలి ,గుజరాతి నాటకాలకు మేకప్ ఆర్టిస్ట్ గా, స్టేజి డేకోరే టార్ గా,దర్సకుడుగా పనిచేసారు
వీటిలో ..ప్రసిద్ది చెందిన ఉత్పలదత్ ,శంభు మిత్ర ,ఆశిథ్ బోస్ తదితరుల నాటకాలు కూడా ఉన్నాయి ..!

డాక్టర్ మేకప్
---------------
ఎన్నో భాషలు అనర్గళంగా మాట్లాడే అంజిబాబు ను సినిమా రంగంలో బెంగాలి బాబు అనుకోవటం యాదృచ్చికమే అయినా అయన ఏకలవ్య గురువుగా భావించే వ్యక్తి మాత్రం
బెంగాలీబాబే ...
అయన పేరు " హరిబాబు " ..
కాని మద్రాస్ లో స్థిరపడటం వలన అందరూ ఆయనను తెలుగువారు అనుకునేవారట ... హరిబాబు దగ్గర ప్రత్యక్షంగా మేకప్ విద్య నేర్చుకోకపోయినా అయన పద్ధతి మాత్రం
తన మీద చెరగని ముద్ర వేసింది అని అంజిబాబు చెప్తారు ..
పాతాళభైరవి లో ఎస్వి రంగారావు ను నేపాలి మాత్రికుడిగా మార్చివేసింది ఈ హరిబాబే ...
అయితే ఒక కళాకారుడు తన వృత్తిని ఎలా గౌరవించాలో మాత్రం నేర్చుకుంది గుంటూర్ మెడికల్ కాలేజి లో అని చెప్పారు అంజిబాబు ...
అయన మేకప్ గదిలో ఉన్నారంటే ఎప్పుడు డాక్టర్ లు వాడే తెల్లకోటులోనే కనిపిస్తారు ..
ఇట్లా పక మేకప్ ఆర్టిస్ట్ కు ఒక వృత్తిపరమైన దుస్తులును మొట్టమొదటిగా ప్రవేశ పెట్టిన వారు శ్రీ అంజిబాబు ...
దీనికొక కథ ఉంది ...
1960 ప్రాంతం లో గుంటూర్ మెడికల్ కాలేజి విద్యార్ధుల వార్షిక నాటకోత్సవాల సందర్భంగా మేకప్ చేస్తున్న అంజిబాబు ను,ప్రిన్సిపాల్ డాక్టర్ జగన్నాథ రెడ్డి చూసారు ..
ఈ యువ మేకప్ ఆర్టిస్ట్ నైపుణ్యం ... ప్రిన్సిపాల్ ను ముగ్ధుణ్ణి చేసింది ...
అయన తర్వాత అంజిబాబు ను తన గదికి పిలిపించుకుని ....
" బాబు..... నీకున్న విద్యను నువ్వు గౌరవించడం లేదయ్యా ...!
ఆ లుంగి ...రంగుల మరకల చొక్కా ..ఏమిటీ అవతారం ...?
నిన్ను మేకప్ గదిలో చూసినపుడు సర్జరీ చేస్తున్న డాక్టర్ లాగ ఉన్నావు ....
నిజానికి నువ్వు డాక్టర్ లాగే ప్రొఫెషనల్ వే ... ఇదిగో ఈ తెల్ల కోటు ఇస్తున్నాను ...
ఇక మీదట ..ఎప్పుడు రంగుల్లో చేతులు పెట్టబోయే ముందు ....ఈ కోటులోనే ఉండాలి ....
అప్పుడు ఎవరూ.... నీ గదిలోకి దూరి " ఏయ్ ..మేకప్ ..! అని అనడానికి సాహసించరు ... అని తన కుర్చికి తగిలించిన ఉన్న వైట్ ఎఫ్రాన్ తీసి బాబుకు బహుకరించారు
అప్పటినుంచి ఇప్పటిదాకా మేకప్ గదిలో అయన ఆ డ్రెస్ లోనే కనిపిస్తారు ....
(నేను ఆలాంటి ఫోటో కోసం గూగూల్ లో ప్రయత్నించాను దొరకక ..దొరికిన ఈ ఫోటో పెడుతున్నాను )

తెలుగు రంగస్థలమ మీద ఎందరో కళాకారులతో పాటు .... ప్రజా కళాకారుడు గరికపాటి రాజారావు లాంటి వారితో పనిచేస్తూ ...
ప్రజానాట్యమండలి తో ఎంతో సాన్నిహిత్యంతో అంజిబాబు 1969 లో సోవియెట్ యూనియన్ సందర్శించి వచ్చారు ...

ఆనాటి రష్యాకు ..ఇప్పటి రష్యాకు పోలికే లేదంటారు ...!ఈ స్వామి వివేకానంద కోసం అమెరికా (చికాగో ),కెనడా ..లండన్ చూడబోతున్నారు ..



నిజానికి ఈ రంగంల్లో ఎంతకాలం అసిస్టెంట్ గా చేసినా అసలు మర్మం చెప్పారు ..తమని మించిపోతారని ....కాని ఈ విద్యలో నా శిష్యుడు నన్ను మించిపోయిన రోజు నా జన్మధన్యం మైనదనుకుంటాను..అన్నారు అంజిబాబు ...



అయన భార్య లక్ష్మి ,కాలేజి చదువులకేదిగిన ఒక కుమార్తె,ఇద్దరూ కుమారులు లతో ..ఇప్పుడు పూణే లో నివాసం ఉంటున్నారు ...!పూణే తెలుగు సంఘానికి అధ్యక్షుడుగా ఉండి ,ఆ సంఘానికి ఒక భవనం కట్టించి ,సాంస్కృతిక కార్యక్రమాలలో తన భార్య తో పాటు రంగస్థలం మీద నటించడం ,తన సహచర నటుడు (ద్రోహి 1948 ,L.V.Prasad Director సినిమాలో విలన్ ) కోన ప్రభాకర్ రావు ..అదే రాష్ట్రానికి గవర్నర్ గా వచ్చినప్పుడు "తెలుగు" వాడిగా సన్మానించడం ... మర్చిపోలేని అనుభావాలు అంటారాయన ..! 

( 1995 ఏప్రిల్ 22 న ఆంధ్ర జ్యోతి పేపర్ లో " శ్రీ అంజిబాబు " గారి గురించి వచ్చిన ఆర్టికల్ ఇది )

" శ్రీ అంజిబాబు గారు " మీద వచ్చిన ఈ ఆర్టికల్ చదవటం వలన ....
సినిమా రంగం లో మేకప్ మీద ... నా దృస్టి ప్రత్యేకమైపోయింది .....
మేకప్ మీద పేపర్స్ లో వచ్చిన ప్రతి ఆర్టికల్ని దాచుకోవటం లో ...( చాల చాల పేపర్ కట్స్ ఉన్నాయి )
షూటింగ్ లలో ... మేకప్ ఆర్టిస్ట్స్ ని విసిగించి విషయాలు తెలుసుకోవడం లో చాల చాల ఉపయోగపడింది ...
నేను తెలుగు సినిమా పరిశ్రమలో జాయిన్ అయినప్పటినుంచి ...
ఎవరైనా...హీరో హీరోయిన్ ..& ఆర్టిస్ట్ కెమెరా ముందుకు రాగానే ...ఒక్కసారి తేరిపార చూసి వాళ్ళ మేకప్ నిశితంగా పరిశీలించడం అలవాటు చేసుకున్నాను ...
ఏమైనా అనుమాలుంటే... మా డి.ఓ.పి గారికి చెప్పి ,మేకప్ ఆర్టిస్ట్ ని పిలిచి క్లారిఫై చేసుకోవడం అలవాటు అయింది ...
ఇదంతా ... శ్రీ అంజిబాబు గారి మీద వచ్చిన ఈ ఆర్టికల్ వలెనే ...
అలాంటి ఆయనగురించి ..నేను పరిశ్రమకు వచ్చిన కొత్తలో ... రవీంద్ర భారతికి అనుబంధంగా ఉన్న అక్కినేని నటనా గురుకులం లో కొంతకాలం పనిచేశారని విన్నాను
ఇప్పుడు అయన గురించి వివరాలు తెలియలేదు (గూగుల్లో సెర్చ్ చేసినా ...)
మీ కెవరికైనా అయన గురించి తెలిస్తే ... పంచుకోగలరు

ఇంతటి పేరు ప్రఖ్యాతలున్న " శ్రీ అంజిబాబు " గారు మన తెలుగు వారు అయినందుకు గర్వ పడుతూ
నా ఆనందాన్ని ...ఈ విధంగా ...
మన " తెలుగు సినిమా పిచ్చోళ్ళు " గ్రూప్ సభ్యులతో పంచుకుంటున్నాను ..!


మీ
కొండవీటి నాని

No comments:

Post a Comment